రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షల బ్లాక్ మనీ ఇస్తామని మోసం… 12 మంది ముఠా అరెస్ట్…
రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షల బ్లాక్ మనీ ఇస్తామని ఆశ చూపించి అమాయకులను మోసం చేస్తున్న 12 మంది సభ్యులతో కూడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ముఠాలోని ఓ సభ్యుడు బాధితులకు ఫోన్ చేసి, తన వద్ద రూ.2 కోట్ల బ్లాక్ మనీ ఉందని, దానిని వైట్ మనీగా మార్చుకోవాల్సి ఉందని చెబుతూ, రూ.10 లక్షలు ఇస్తే ప్రతిగా రూ.40 లక్షలు అందజేస్తామని నమ్మించేవాడు.
బాధితుడు నగదుతో వచ్చిన అనంతరం, ఫేక్ కరెన్సీ నోట్లతో నింపిన బ్యాగ్‌ను ముఠాలోని మరో సభ్యుడు అందజేసేవాడు. అదే సమయంలో నకిలీ పోలీసుల వేషంలో వచ్చిన ఇతర సభ్యులు అక్కడికి చేరుకుని, దొంగ నోట్ల వ్యాపారం చేస్తున్నారని, మోస్ట్ వాంటెడ్ నేరస్థులని బెదిరించి బాధితుడి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని పరారయ్యేవారు.
ఈ మోసానికి గురైన ప్రొద్దుటూరుకు చెందిన గంగాధర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.18 లక్షల నగదు, 16 మొబైల్ ఫోన్లు, నకిలీ పోలీసు యూనిఫాంలు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.






















