నిజామాబాద్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. భార్యాభర్తల వివాదం ఉద్రిక్తతకు దారి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య నెలకొన్న కుటుంబ వివాదం రెండు తండాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
స్థానికుల వివరాల ప్రకారం.. ఒక తండాకు చెందిన యువతి, అదే మండలంలోని మరో తండాకు చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. అయితే వ్యక్తిగత మనస్పర్థల కారణంగా గత నాలుగేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరి కుటుంబ వివాదానికి సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉంది.
ఈ నేపథ్యంలో భర్త తనను దూషించాడని భార్య తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, ఆమె బంధువులు నలుగురు కలిసి అతడిని నిలదీసి దాడి చేసినట్లు సమాచారం. అనంతరం ఈ విషయాన్ని బాధితుడు తన గ్రామస్థులకు తెలియజేయడంతో వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని, అమ్మాయి బంధువులను వారి తండాకు తీసుకెళ్లి ప్రతిదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు పోలీసులపై కారం చల్లి గొడవకు దిగినట్లు సమాచారం. దీంతో అదనపు పోలీసు బలగాలను తండాకు తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఘటనపై స్పందించిన సీఐ వినోద్ మాట్లాడుతూ, భార్యాభర్తల మధ్య ఉన్న వివాదం పెద్ద ఘర్షణకు దారితీసిందని తెలిపారు. ప్రస్తుతం తాము ఘటనాస్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ఈ ఘటనకు సంబంధించి కొందరిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.






















