ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం దూస్‌గాం గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, స్థానిక తహసీల్దార్ (ఎంఆర్వో) నుంచి ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేస్తూ, ప్రతి అర్హుడికి ఎన్యూమరేషన్ ఫారం అందించి, వాటిని తిరిగి సేకరించే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
మండల వ్యాప్తంగా దాదాపు 60 శాతం, దూస్‌గాం గ్రామంలో 60 నుంచి 70 శాతం వరకు ప్రక్రియ పూర్తవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని, అధికారిక గడువు ఈ నెల 24వ తేదీ వరకు ఉన్నప్పటికీ, ఈ నెల 20వ తేదీనే లక్ష్యంగా పెట్టుకుని ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహకారం అందించేందుకు బీఎల్‌ఏలు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని పేర్కొన్న ఎమ్మెల్యే, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చూడాలని, ఏ ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబర్ సింగ్, మునిపల్లి సాయిరెడ్డి, అమృతపూర్ గంగాధర్, భాస్కర్ రెడ్డి, ఉమ్మాజీ నరేష్, పొలసాని శ్రీనివాస్, తారాచంద్ నాయక్, రాంచందర్ గౌడ్, స్థానిక సర్పంచ్ సువర్ణ-వెంకటేష్, సుదర్శన్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

























