ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే రేపటి తెలంగాణ నిర్మాణ శిల్పులు: సీఎం రేవంత్ రెడ్డి!
“పలుగు, పార పట్టిన చేతులే కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.
వనపర్తి జిల్లా కొత్తకోటలో నూతనంగా నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి, అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, చదువే భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి అని అన్నారు. చదువుతోనే జీవితంలో వెలుగులు నిండుతాయని, ఆత్మగౌరవం పెరుగుతుందని, తల్లిదండ్రుల కలలు నెరవేరుతాయని విద్యార్థులకు సూచించారు.
ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని 27.50 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కిట్లలో తొమ్మిది రకాల వస్తువులు ఉంటాయని, వాటి నాణ్యతపై విద్యార్థులు వాట్సాప్ ద్వారా నేరుగా అభిప్రాయాలు తెలియజేసే విధంగా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.
గతంలో సరైన మౌలిక సదుపాయాల లేమితో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని, అందుకే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయులకు 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, 10 ఏళ్లుగా జరగని బదిలీలు పూర్తి చేశామని చెప్పారు. అలాగే 317 జీవో కారణంగా విడిపోయిన కుటుంబాలను మళ్లీ ఒకచోట చేర్చేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఉపాధ్యాయుల కృషి వల్ల కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 36వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు. అయితే ఇంతటితో సంతృప్తి చెందకుండా దేశంలో తొలి రెండు స్థానాల్లో నిలిచే వరకు కృషి కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సత్కరిస్తామని తెలిపారు.
ప్రపంచంలోని ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసేందుకు ఇప్పటికే 50 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపామని, వచ్చే ఏడాది మరో 150 మంది టీచర్లను పంపనున్నట్లు వెల్లడించారు.
ఏఐ విప్లవం నేపథ్యంలో యువతలో నైపుణ్యాభివృద్ధి అత్యవసరమని పేర్కొన్న సీఎం, విద్యార్థులు జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలు నేర్చుకుని ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల నుంచే భవిష్యత్తు డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు తయారవాలని, చదువులో రాణించలేని వారు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.
ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.






















