విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసిన నలుగురికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష…
నిజామాబాద్, జూలై 15: విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లపై దాడి చేసి ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన నలుగురు నిందితులకు నిజామాబాద్లోని III అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి (ఫ్యామిలీ కోర్టు) డి. దుర్గా ప్రసాద్ మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. 2025 జూన్ 22/23 అర్ధరాత్రి సమయంలో మోర్తాడ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు తోపారపు వినయ్ (PC-2431), షౌకత్ అలీ (PC-1786) క్రైమ్ బీట్ డ్యూటీలో ఉన్నారు. రాత్రి సుమారు 1 గంట సమయంలో డొంకల్ గ్రామ సమీపంలోని రాజస్థాన్ డాబా వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ప్రశ్నించారు.
దీంతో నిందితులు దాల్మల్కా భూపతి, నూతికట్టు శివకుమార్, నూతికట్టు శ్రీవర్ధన్, తోపరం శశిశేఖర్ పోలీసులను దుర్భాషలాడుతూ విధులకు ఆటంకం కలిగించారు. అనంతరం కానిస్టేబుల్ షౌకత్ అలీ ధరించిన రెయిన్‌కోట్‌ను చింపివేయడంతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను కిందకు తోసివేశారు. అక్కడే ఉన్న బండరాయిని తీసుకుని వారిపై విసిరేందుకు ప్రయత్నించినట్లు కేసులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై మోర్తాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి పోలీసులు శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు నిర్వహించారు. సేకరించిన బలమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో సమర్పించడంతో నిందితులపై అభియోగాలు రుజువయ్యాయి.
దీంతో నలుగురు నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడిన వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని ఈ తీర్పు స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు.

























