అనుమతుల ప్రకారమే ఇసుక తరలిస్తున్నాం గ్రామాభివృది కమిటీ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ మండల,.బడా భీంగల్ గ్రామ సమీపంలోని కప్పల వాగు వద్ద గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) ప్రతినిధులు, గ్రామానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల స్థానిక నాయకులు ఉమ్మడిగా అత్యవసర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కప్పల వాగు ఇసుక రవాణాపై నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం చేస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గ్రామంలో ఇసుక రవాణా అంతా విడిసి ఆధ్వర్యంలో, ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆన్‌లైన్ ద్వారా లీగల్ గా డీడీలు (DDs) చెల్లించి, అధికారిక అనుమతులతోనే పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అక్రమాలకు తావులేదని, ఈ ప్రక్రియకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని వెల్లడించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై కనీస అవగాహన లేని కొంతమంది నాయకులు తమ ఉనికి కోసం ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం ఒకరిపై ఒకరు బురద చల్లుకునే క్రమంలో పవిత్రమైన బడా భీంగల్ గ్రామాన్ని వివాదాల్లోకి లాగడం సరికాదని హితవు పలికారు. ఇప్పటికైనా గ్రామానికి అపవాదు తెచ్చే యత్నాలు ఆపాలని, భవిష్యత్తులోనూ తమ గ్రామంపై గానీ, ఇక్కడి ఇసుక రవాణాపై గానీ సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేస్తే గ్రామస్తులంతా ఏకమై తగిన రీతిలో బుద్ధి చెబుతామని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, మాజీ సర్పంచి ఎర్రోళ్ల సంజీవ్, ఆయా పార్టీల నాయకులు మోర్తాడ్ లింబాద్రి, రాగుల మోహన్, శ్రీధర్ గౌడ్, వెల్దుర్తి కిషన్, గట్టు సతీష్, చింతకింది భూమేశ్వర్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.























