బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి సీతక్క
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు
మంత్రి దృష్టికి నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్లిన కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా: బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మంగళవారం బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ ప్రజానిలయానికి విచ్చేసిన మంత్రి సీతక్కకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, కొనసాగుతున్న పనుల పురోగతి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ముత్యాల సునీల్ కుమార్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క సంబంధిత అధికారులతో మాట్లాడి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఇందిరమ్మ కాలనీ సమస్యలపై మంత్రి ప్రత్యేక దృష్టి
అనంతరం వేల్పూర్ మండలంలోని ఇందిరమ్మ కాలనీని మంత్రి సీతక్క సందర్శించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను స్థానిక నాయకులు, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యాలకు సంబంధించిన సమస్యలపై ఆరా తీశారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, గ్రామాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. మంత్రి సీతక్క సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి పనులకు మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్యంపాలెం నరసయ్య, మండల ఫోరం అధ్యక్షుడు అరిగెల జనార్ధన్, మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గ సర్పంచుల ఫోరం ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

























