నీటి వృథాకు అడ్డుకట్ట.. భూగర్భ జలాల పెంపునకు వినూత్న చర్య!
పాఠశాలలో చేతులు కడిగిన నీటిని భూమిలోకి మళ్లించే నిర్మాణం
ప్రతి ఇంట్లోనూ ఇలాంటి ఇంకుడు నిర్మాణాలు చేపట్టాలి: సర్పంచ్ గడల ప్రసాద్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్: నీటిని వృథా చేయకుండా ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా జాగిర్యాల గ్రామంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం జాగిర్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకున్న అనంతరం వృథాగా వెళ్లే నీటిని భూగర్భంలోకి మళ్లించేలా ప్రత్యేక ఇంకుడు నిర్మాణాన్ని ఏర్పాటు చేసి పూర్తి చేశారు.
ఈ నిర్మాణం ద్వారా వృథా నీటిని కమ్యూనిటీ సోక్పిట్లోకి మళ్లించి భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టారు. తద్వారా భూగర్భ జలాల మట్టం పెరిగి గ్రామానికి మేలు జరుగుతుందని గ్రామ సర్పంచ్ గడల ప్రసాద్ తెలిపారు.
ఈ నిర్మాణాన్ని పరిశీలించిన విద్యార్థులు సైతం స్ఫూర్తి పొంది తమ ఇళ్ల వద్ద కూడా ఇలాంటి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని నిర్ణయించుకోవడం అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు.
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నీటిని వృథా చేయకుండా భూగర్భ జలాలను పెంచేందుకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సర్పంచ్ గడల ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన విద్యార్థులను ఆయన అభినందించారు.

























