ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించాలి: ఎంపీడీవో మారుతి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నెల 8వ తేదీన (ఆదివారం) ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించాలని ఎంపీడీవో మారుతి కోరారు.
ఈ సందర్భంగా మండలంలోని 213 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహాలపై ప్రభుత్వం నిర్దేశించిన లోగోతో పాటు లబ్ధిదారుల పూర్తి పేరు, గుర్తింపు సంఖ్య, ఇల్లు మంజూరైన సంవత్సరం, ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఆర్థిక సహాయం వివరాలను పెయింటింగ్ ద్వారా నమోదు చేయించినట్లు తెలిపారు.
దీపావళి పండుగను పురస్కరించుకుని ఇందిరమ్మ ఇళ్లను మామిడి తోరణాలు, పూలతో అందంగా అలంకరించి పండుగ సంబరాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీడీవో మారుతి విజ్ఞప్తి చేశారు.

























