మహిళా రైతుల కష్టాలు చూసి చలించిపోయిన కవిత.. కలెక్టర్‌తో మాట్లాడి విత్తనాలు పంపిణీ చేయించిన వైనం!
ఉదయం నుంచి వేరుశనగ విత్తనాల కోసం పడిగాపులు.. రైతుల ఇబ్బందులపై స్పందించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత…
పోలేపల్లి – దేవరకొండ : నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలేపల్లి రైతు వేదిక వద్ద వేరుశనగ విత్తనాల కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న మహిళా రైతుల ఇబ్బందులను చూసి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చలించిపోయారు. వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి రైతులకు విత్తనాలు పంపిణీ చేయించేలా చర్యలు తీసుకున్నారు.
డిండి ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న సమయంలో పోలేపల్లి రైతు వేదిక వద్ద పెద్ద సంఖ్యలో మహిళా రైతులు వేచి ఉండటాన్ని గమనించిన కవిత.. వారి సమస్యలపై ఆరా తీశారు. అయితే, శనివారం సాయంత్రం డిండి నుంచి తిరిగి వస్తున్న సమయంలో కూడా మహిళా రైతులు అక్కడే వేచి ఉండటాన్ని గమనించి రైతు వేదికను సందర్శించారు.
ఈ సందర్భంగా వేరుశనగ విత్తనాల కోసం ఉదయం నుంచి ఎదురుచూస్తున్నా అధికారులు విత్తనాలు పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళా రైతులు కవితకు తమ ఆవేదనను వివరించారు.
దీంతో వెంటనే స్పందించిన కవిత నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో ఫోన్లో మాట్లాడారు. గత ఏడాది 1,100 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయగా, ఈ ఏడాది కేవలం 600 క్వింటాళ్లు మాత్రమే కేటాయించడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
కవిత విజ్ఞప్తిపై స్పందించిన కలెక్టర్.. ఉదయం నుంచి విత్తనాల కోసం ఎదురుచూస్తున్న మహిళా రైతులకు వెంటనే వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన రైతుల పేర్లను నమోదు చేసుకుని, ఇంకా ఎంతమేర విత్తనాలు అవసరమో తెలియజేస్తూ ఇండెంట్ పంపించాలని సూచించారు.
కలెక్టర్ ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి విత్తనాల కోసం ఎదురుచూస్తున్న మహిళా రైతులకు వేరుశనగ విత్తనాల సంచులను పంపిణీ చేశారు. రైతుల సమస్యలను గుర్తించి తక్షణమే స్పందించిన కవితకు మహిళా రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

























