జీజీహెచ్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి…
వైద్య ఆరోగ్యశాఖ ఉమ్మడి జిల్లా సమీక్షలో ఎమ్మెల్యే ధన్ పాల్…
ఇందూరు: జిల్లా జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తొందరగా పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. సోమవారం హైదరాబాదులో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ఉమ్మడి జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా జనరల్ ఆసుపత్రిలో నిత్యం 2 వేలకు పైగా ఓపీ నమోదవుతుందన్నారు. అటువంటి ఆసుపత్రిలో మల్టీ స్పెషాలిటీ స్థాయి సౌకర్యాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధానంగా ఆసుపత్రిలో ఎంఆర్ఐ, మార్చురీ ఫ్రీజర్ల అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే ఆక్సిజన్ ప్లాంట్ సరిగా పనిచేయడం లేదని దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కావున లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సమీక్షలో చెప్పినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆసుపత్రిలో సివిల్ వర్క్ లకు సంబంధించిన పనులను తొందరగా పూర్తి చేయాలని, రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చర్చించినట్లు చెప్పారు. అలాగే సివిల్ సర్జన్ రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్లు, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ల అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి పత్రం అందజేశారు.























