జోరుగా ద్విచక్ర వాహనాల పై రేషన్ బియ్యం కొనుగోలు & అమ్మకాలు…
అధికారుల నిఘా అవసరం అంటున్న ప్రజలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో వినిపిస్తున్నాయి. మండల కేంద్రంతో పాటు, గ్రామాలలో కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ రేషన్ బియ్యం సేకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించే ఉద్దేశంతో రేషన్ బియ్యాన్ని ఉచితంగా లేదా సబ్సిడీపై అందిస్తోంది. అయితే కొందరు లబ్ధిదారులు తమకు అందుతున్న బియ్యాన్ని ఇతరులకు విక్రయిస్తున్నారని, అదే విధంగా కొందరు వ్యక్తులు వాటిని కొనుగోలు చేసి తిరిగి అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో,ఇదే అదనుగా తీసుకుని బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతు ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యం కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం పేదల కోసం కేటాయిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కొనేవారిపై, అమ్మెవారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్న వారితో పాటు విక్రయిస్తున్న వారిపైనా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కమ్మర్‌పల్లి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్ దుకాణాల నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ అయిన తర్వాత అది ఎక్కడికి వెళ్తోంది,ఎవరు కొనుగోలు చేస్తున్నారు,అనే అంశాలపై అధికారులు నిఘా పెట్టాలని సూచిస్తున్నారు.

























