కార్మికులకు రూ.39,373 కనీస వేతనం ఇవ్వాలి…
TUCI ఆధ్వర్యంలో ధర్పల్లిలో ధర్నా.. అధికారులకు వినతిపత్రం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
కార్మికులకు నెలకు రూ.39,373 కనీస వేతనం చెల్లించాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) ఆధ్వర్యంలో గురువారం ధర్పల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా TUCI నిజామాబాద్ రూరల్–కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ఆర్. రమేష్ మాట్లాడుతూ.. కార్మికులు, వారి కుటుంబాలు గౌరవప్రదంగా జీవించేందుకు సరిపోయేలా కనీస వేతనాలను నిర్ణయించాలని అన్నారు. ప్రస్తుత ధరలు, కుటుంబ అవసరాలను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయంగా కనీస వేతనం నిర్ణయించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు, పని సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరాల ఆధారిత వేతనం అందించాలని కోరారు. జీవన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (VDA) ద్వారా పెరిగిన ఖర్చులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మే 2026 నాటి ధరలను పరిగణనలోకి తీసుకుని నెలకు రూ.39,373 కనీస వేతనం అమలు చేయాలని కార్మిక శాఖను కోరారు. అలాగే గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఖాతాల్లో జమ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని TUCI నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో TUCI ధర్పల్లి మండల అధ్యక్షుడు ఒడ్డేటి ఆశన్న, సిరికొండ మండల అధ్యక్షులు, నాయకులు సాయిలు, విలాస్, జగన్, వర్షిత్, సర్బుద్దిన్, శారద, సులోచన, సాయవ్వ, రాధ తదితర కార్మికులు పాల్గొన్నారు.























