*కేసీఆర్ ఇచ్చిన జాబ్ లకు,కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేస్తూ ‘రిబ్బన్ రెడ్డి’ గా మారిన రేవంత్ రెడ్డి*
*కాంగ్రెస్ ‘యూత్ డిక్లరేషన్’ మోసాలపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి*
*కేసీఆర్ హయాంలో 2,02,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇచ్చి 1.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ..*
*రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఉద్యోగాలు కేవలం 16,978 మాత్రమే..అసెంబ్లీ రికార్డులే సాక్ష్యం.*
*విద్యా భరోసా కార్డ్ ఏదీ? ఉచిత స్కూటీలు ఏవీ? కాంగ్రెస్ నాయకులను నిలదీయండి*
*రూ. 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి*
*నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికీ రూ. 1.32 లక్షలు బాకీ పడ్డ రేవంత్ సర్కార్*
*పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలను దెబ్బతీసే జీవో 69ని వెంటనే రద్దు చేయాలి.*
*జెన్-జీ (Gen-Z) తిరుగుబాటు తప్పదు.. యువత ఆగ్రహానికి రేవంత్ రెడ్డికి రాజకీయ రిటైర్మెంట్ ఖాయం*
*తెలంగాణ లో ప్రజాపాలన కాదు… చంద్రబాబు పచ్చపాలన నడుస్తుంది*
*బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు,యువతకు ఇచ్చిన హామీలపై ‘కాంగ్రెస్ బాకీ కార్డ్’ విడుదల..*
*కాంగ్రెస్ సర్కార్‌పై యువత తీర్మానాల ఆమోదం*
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ : ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని నిలువునా మోసం చేసిందని బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీమ్‌గల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “విద్యార్థి, నిరుద్యోగ సదస్సు”లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతకుముందు భీమ్‌గల్‌లో విద్యార్థులు, యువతీయువకులు వేలాదిగా తరలివచ్చి చేపట్టిన భారీ బైక్ ర్యాలీ విజయవంతం కావడంపై ఆయన యువతకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
గత పదేళ్ల కేసీఆర్ పాలనలో బాల్కొండ నియోజకవర్గంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంజూరు చేయించి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేశామని తెలిపారు. భీమ్‌గల్, మోర్తాడ్ వంటి కేంద్రాల్లో ‘న్యాక్’ (NAC) ద్వారా యువతకు ఉచిత సాంకేతిక శిక్షణ ఇప్పించి నైపుణ్య ధ్రువీకరణ పత్రాలతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించామని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ అభ్యర్థుల కోసం నియోజకవర్గంలో ఉచిత కోచింగ్ శిబిరాలు నిర్వహించి, నాణ్యమైన స్టడీ మెటీరియల్ అందించామని గుర్తుచేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 2,32,328 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు రాగా, 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అందులో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా భర్తీ చేసిందని, మరో 42,652 పోస్టులకు రాత పరీక్షల వరకు ప్రక్రియను పూర్తి చేసిందన్నారు.
అధికారంలోకి రాగానే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇటీవల అసెంబ్లీ 8వ సెషన్‌లో ఎమ్మెల్యే కేటీఆర్ అడిగిన ప్రశ్నకు (నం. 1649) స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 31,798 పోస్టులకు 16 నోటిఫికేషన్లు ఇచ్చి అందులో కాంగ్రెస్ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసింది కేవలం 16,978 ఉద్యోగాలు మాత్రమేనని అసెంబ్లీ సాక్షిగా బట్టి సమాధానం ఇచ్చారన్నారు.
ప్రభుత్వం భర్తీ చేసినట్లు చూపుతున్న 67,763 పోస్టులలో.. ఏకంగా 50,785 ఉద్యోగాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి నియామక ప్రక్రియ పూర్తి చేసినవేనని దీనివల్ల స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వీడియోలను ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు:
కళాశాలలకు వెళ్లే ప్రతి యువతికి ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని ప్రియాంక గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించి, నేడు ఒక్క విద్యార్థినికి కూడా ఇవ్వకుండా విస్మరించారు.
ఉన్నత విద్యాభ్యాసం, ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్‌ల కొనుగోలుకు ప్రతి విద్యార్థికి రూ. 5 లక్షల బ్యాంక్ గ్యారెంటీ విద్యా భరోసా కార్డు ఇస్తామని భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి సంతకాలతో గ్యారెంటీ కార్డులు పంపిణీ చేసి, అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలో తొక్కారు.
గత మూడు విద్యా సంవత్సరాలుగా రూ. 12 వేల కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే విద్యా సంస్థలు మూతపడి పేద విద్యార్థుల చదువులు ఆగిపోతాయని హెచ్చరించారు.
మండలానికి ఒక “తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్” ఏర్పాటు చేస్తామన్న హామీ అటకెక్కిందని, యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించిన 10వ తరగతి పాసైన వారికి రూ. 10 వేలు, ఇంటర్‌కు రూ. 25 వేలు, డిగ్రీకి రూ. 50 వేలు, పీజీకి రూ. 1 లక్ష, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం హామీలను పూర్తిగా గాలికొదిలేశారని దుయ్యబట్టారు.
చదువుకుని ఉద్యోగం లేని యువతకు నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ లెక్కన రేవంత్ సర్కార్ ఇప్పటికే ఒక్కో నిరుద్యోగికి రూ. 1,32,000 బాకీ పడిందని తెలిపారు.
గతంలో రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించిన హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ చౌరస్తాలోనే.. నేడు న్యాయమైన ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతపై పోలీసులు దారుణంగా లాఠీచార్జీలు చేసి జైళ్లకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల అవకాశాలను దెబ్బతీసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 69ని వెంటనే రద్దు చేయాలని, విద్యార్థులపై నిర్బంధాన్ని విడనాడాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ సర్కార్ నాశనం చేసిందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ హయాంలో రెప్పపాటు కోత లేకుండా నిరంతర విద్యుత్ అందగా, నేడు మళ్లీ పల్లెల్లో, పొలాల్లో ఇన్వర్టర్లు, మోటార్ల కష్టాలు మొదలయ్యాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షసాధింపు చర్యలతో గోదావరి జలాలను ఒడిసిపట్టకుండా సదర్మట్, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ద్వారా నీటిని కిందికి వదిలేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయేలా చేస్తున్నారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో మెనూ సక్రమంగా అమలు కాక, పురుగుల అన్నం తిని విద్యార్థులు రోజూ ఆస్పత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలన చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో సాగుతోందని, అందుకే ఆయనకు ‘రేవంత్ రెడ్డి’ అని కాకుండా కేసీఆర్ కట్టిన నిర్మాణాల రిబ్బన్లు కట్ చేయడం తప్ప ఏమీ తెలియని ‘రిబ్బన్ రెడ్డి’ అనే పేరు సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు.
సదస్సు తీర్మానాలు & డిమాండ్లు:
సదస్సులో హాజరైన వేలాది మంది విద్యార్థులు, యువత చేతులెత్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కింది డిమాండ్లను ఏకగ్రీవంగా ఆమోదించారు:
1. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం మూడేళ్ల కాలానికి గాను తక్షణమే 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి.
2. అధికారిక జాబ్ క్యాలెండర్‌ను తక్షణమే విడుదల చేయాలి.
3. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4,000 చొప్పున ఇప్పటివరకు పేరుకుపోయిన రూ. 1,32,000 బకాయిలను వెంటనే చెల్లించి, భృతిని నిరంతరం కొనసాగించాలి.
4. ప్రైవేట్ సంస్థల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని అమలు చేయాలి.
5. యూత్ కమిషన్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలి.
6. విద్యార్థినులకు తక్షణమే ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు, విద్యార్థులందరికీ రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు పంపిణీ చేయాలి.
7. పెండింగ్‌లో ఉన్న రూ. 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
8. బాసర తరహాలో మరో 4 నూతన ట్రిపుల్ ఐటీలను (IIIT) ఏర్పాటు చేసి, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
9. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే జీవో 69ని తక్షణమే ఉపసంహరించుకోవాలి.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఏకమై పోరాడి కేంద్ర మంత్రులనే గద్దె దించిన చరిత్ర దేశ యువతకు ఉందని, జెన్-జీ (Gen-Z) యువత ఆగ్రహాన్ని రేవంత్ సర్కార్ తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో యువతే ఏకమై రేవంత్ రెడ్డికి రాజకీయ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపడం ఖాయమని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడి పోరాటాన్ని ఉధృతం చేస్తుందని పునరుద్ఘాటించారు.

























