సాంపల్లి సర్పంచ్ భర్తకు రూ.13,325 జరిమానా
టేకు చెట్ల తొలగింపు కేసులో అటవీశాఖ చర్యలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంసాంపల్లి గ్రామంలో టేకు చెట్ల తొలగింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అనుమతి లేకుండా టేకు చెట్లను తొలగించిన కేసులో సాంపల్లి సర్పంచ్ సంధ్య భర్త మాసూరి ప్రశాంత్‌కు అటవీశాఖ అధికారులు రూ.13,325 జరిమానా విధించినట్లు సమాచారం.
అసలేం జరిగింది?
సాంపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం జేసీబీతో తవ్వకాలు చేపట్టిన సమయంలో, గ్రామానికి చెందిన అంతరెడ్డి నర్సయ్య తన ఇంటి పక్కన చాలా కాలంగా పెంచుకుంటున్న టేకు చెట్లను తొలగించారని ఆరోపించారు.
తనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదా నోటీసులు ఇవ్వకుండానే సర్పంచ్ భర్త మాసూరి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర సమక్షంలో జేసీబీ సహాయంతో 12 టేకు చెట్లను తొలగించారని నర్సయ్య అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
డీఎఫ్‌వోకు ఫిర్యాదు
ఏళ్ల తరబడి పెంచుకున్న టేకు చెట్లను తొలగించడంతో నష్టపోయానని పేర్కొంటూ నర్సయ్య నేరుగా జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో)కు ఫిర్యాదు చేశారు. చెట్ల తొలగింపు విషయంలో తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఈ అంశంపై పంచాయతీ కార్యదర్శిని సంప్రదించినప్పటికీ సరైన వివరణ ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
వాల్టా చట్టం ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని నర్సయ్య కోరారు.
క్షేత్రస్థాయి విచారణ
డీఎఫ్‌వోకు ఫిర్యాదు అందడంతో ఇందల్వాయి ఎఫ్‌ఆర్‌వో రవి భట్ ఆదేశాల మేరకు అటవీశాఖ రేంజ్, బీట్ అధికారులు సాంపల్లి గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.
అనుమతి లేకుండా వ్యక్తిగతంగా పెంచుతున్న చెట్లను తొలగించడం నిబంధనలకు విరుద్ధమని నిర్ధారించిన అనంతరం సాంపల్లి సర్పంచ్ భర్త మాసూరి ప్రశాంత్‌కు రూ.13,325 జరిమానా విధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
అయితే ఈ వ్యవహారంలో పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర పాత్రపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది స్పష్టత రావాల్సి ఉంది.
ఆలస్యంపై బాధితుడి ఆరోపణ
చెట్ల తొలగింపు ఘటన జూలైలోనే జరిగినప్పటికీ, తాను అప్పుడే ఫిర్యాదు చేసినా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేశారని బాధితుడు నర్సయ్య ఆరోపించారు.
గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో చెట్ల తొలగింపునకు సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
అనుమతులు లేకుండా చెట్లను తొలగించిన వ్యవహారంలో అటవీశాఖ జరిమానా విధించడం ప్రస్తుతం సాంపల్లి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

























