భీమ్‌గల్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్‌గల్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జెండాకు వందనం చేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వం 1000 రోజుల ప్రజాపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందిస్తున్నట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని, రానున్న రోజుల్లో మిగిలిన హామీలను కూడా పూర్తిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని నాయకులు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ పట్టణంలో ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేందుకు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. పట్టణ ప్రజలు మున్సిపాలిటీకి సహకరించి పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

























