ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు.. పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్: నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలు, జిల్లాలో సాధించిన అభివృద్ధి, ప్రగతిని వివరించారు.
ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ నృత్య ప్రదర్శనలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. ప్రదర్శనలు ఇచ్చిన చిన్నారులకు బహుమతులు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ భుజంగరావు, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీఆర్ఓ గీత, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఆర్కల నర్సారెడ్డి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిరెడ్డి, పొలసాని శ్రీనివాస్, నరేష్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

























