ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభల విజయవంతానికి బైక్ ర్యాలీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్: అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) 4వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మం పట్టణంలో జరిగే జాతీయ మహాసభలకు రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు.
నిజామాబాద్ నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ న్యాల్‌కల్, సిర్పూర్, మోపాల్, కంజర, ముల్లంగి, ఘనపూర్, సాంపల్లి, అమృతాపూర్, మాణిక్‌బండార్, బోర్గం(కె) తదితర గ్రామాల మీదుగా కొనసాగింది. ఆయా గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ మహాసభలపై విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి అనుకూలమైన విధానాలను అమలు చేయాలని కోరారు. ఖమ్మంలో జరిగే ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలకు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటలకు సరైన ధర లేకపోవడం, సాగు ఖర్చులు పెరగడం, అప్పుల భారం, వ్యవసాయ కూలీలకు నిరంతర ఉపాధి లేకపోవడం వంటి సమస్యలు గ్రామీణ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు.
రైతులు పండించిన పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50 శాతం కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, ఎరువులు, విద్యుత్, సాగునీరు వంటి సౌకర్యాలను రైతులకు సకాలంలో అందించాలని కోరారు. వ్యవసాయ కూలీలకు ఏడాది పొడవునా తగినన్ని రోజుల ఉపాధి కల్పించేలా ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, కనీస వేతనాలను అమలు చేయాలని అన్నారు.
భూమిలేని పేదలు, వ్యవసాయ కూలీలు, దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించి, సాగు చేసుకునే వారికి భూమిపై హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఖమ్మం పట్టణంలో ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 28న ఖమ్మంలో భారీ ప్రదర్శనతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, 29, 30 తేదీల్లో జాతీయ మహాసభలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
దేశంలోని 18 రాష్ట్రాల నుంచి రైతు, వ్యవసాయ కూలీ ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరై భూమి, సాగునీరు, పంటల ధరలు, రుణాలు, రైతు బీమా, ఉపాధి, కనీస వేతనాలు తదితర సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు.
గ్రామాల నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు అగ్గు ఎర్రన్న, కార్యదర్శి బన్సీ, రైతు కూలీ సంఘం నాయకులు గంగాధర్, సాయన్న, సిర్పూర్ గంగాధర్, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు బి. భూమన్న, నాయకులు దేవరాజు, మల్లికార్జున్, ఎం. శివకుమార్, యువజన సంఘం నాయకులు వనమాల సత్యం, దాసు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

























