అర్థరాత్రి చోరీ.. మహిళ కళ్లలో కారం చల్లి బంగారు గొలుసు అపహరణ
కల్కినగర్ కాలనీలో ముగ్గురు దుండగుల హల్‌చల్.. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కినగర్ కాలనీలో మంగళవారం అర్థరాత్రి చోరీ కలకలం రేపింది.
సుదర్శన్ ఇంట్లోకి ముగ్గురు గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు.
హాల్లో నిద్రిస్తున్న శోభ అనే మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించారు.
మహిళ ప్రతిఘటించి కేకలు వేయడంతో దుండగులు ఆమె కళ్లలో కారం చల్లారు.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె కుమార్తెను సైతం బెదిరించారు.
అనంతరం శోభ మెడలోని సుమారు ఐదు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
దుండగులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టినట్లు పట్టణ సీఐ నరహరి తెలిపారు.
అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి చోరీ చేయడంతో కల్కినగర్ కాలనీ వాసుల్లో ఆందోళన నెలకొంది.
కాలనీలో భద్రతను మరింత పెంచాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

























