భూములు కోల్పోతున్న రైతుల ఆవేదన.. న్యాయం చేయాలని వేడుకోలు!
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
నల్లవెల్లి: రైల్వే డంపింగ్ లైన్ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వ్యవసాయమే జీవనాధారమని, ఉన్న భూములను కోల్పోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచడంతో పాటు, కోల్పోతున్న భూములకు బదులుగా మరోచోట సాగుకు అనువైన వ్యవసాయ భూములను కేటాయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మేడ్చల్ నుంచి మహారాష్ట్రలోని ముత్తుకేడ్ వరకు చేపడుతున్న రైల్వే నిర్మాణ పనుల్లో భాగంగా ఇందల్వాయి మండలంలోని గన్నారం, నల్లవెల్లి, సిర్నాపల్లి గ్రామాల పరిధిలో సుమారు 50 ఎకరాలకు పైగా భూములు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం విలేకరులతో మాట్లాడిన రైతులు.. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయంపైనే ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. సారవంతమైన భూములను కోల్పోతే తమ జీవనాధారం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు తెలియకుండానే కొన్ని నెలల క్రితం భూముల్లో రాళ్లు పాతారని, ప్రస్తుతం సాగు చేసుకుంటున్న భూములు రైల్వే నిర్మాణానికి సేకరిస్తున్నారని వాపోయారు.
తమ కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉన్న రెండు, మూడు లేదా నాలుగు ఎకరాల భూమి మొత్తం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నష్టపరిహారం చెల్లించడం కాకుండా, తమకు మరోచోట సాగుకు అనువైన భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా నష్టపరిహారాన్ని పెంచి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తమ సమస్యను ఎంపీ ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లినట్లు రైతులు తెలిపారు.
ఈ నేపథ్యంలో మంగళవారం నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, తహసీల్దార్ గుర్రపు బాలయ్య నల్లవెల్లి రెవెన్యూ పరిధిలో రైల్వే నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతుల భూములను పరిశీలించారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు రైతులు పేర్కొన్నారు.
ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాలకు న్యాయం చేయాలని, తగిన నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ భూములు కేటాయించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

























