ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ పద్ధతులు పాటిస్తున్న 76 మంది రైతులకు ప్రియోనిక్ కంపెనీ సన్మానం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నితీష్
నిజామాబాద్ జిల్లా: ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ, మంచి ఫలితాలు సాధిస్తున్న 76 మంది ప్రగతిశీల రైతులను ప్రియోనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రైతులను ప్రోత్సహించడంతో పాటు, ఆయిల్‌పామ్ సాగులో ఆధునిక, శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపికైన రైతులకు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమానికి ప్రియోనిక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పాశం ప్రసాద్, టెక్నికల్ హెడ్ ఫణికుమార్, జిల్లా ఉద్యానశాఖ అధికారి బండారి శ్రీనివాస్, హెచ్‌ఓలు, ఏరియా మేనేజర్ సాయికిరణ్‌తో పాటు కంపెనీ ఫీల్డ్ సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై సాంకేతిక అవగాహన కల్పించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో ఆయిల్‌పామ్ తోటల్లో ఎదురయ్యే సమస్యలు, వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి యాజమాన్యం, తోటల సంరక్షణ, శాస్త్రీయ సాగు పద్ధతుల అమలు తదితర అంశాలను వివరించారు.
అదేవిధంగా ఉద్యానశాఖ ద్వారా రైతులకు అందుబాటులో ఉన్న వివిధ ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, అర్హతలు, పథకాలను సద్వినియోగం చేసుకునే విధానాలపై అవగాహన కల్పించారు. ఆయిల్‌పామ్ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, తగిన సాంకేతిక పరిష్కారాలను సూచించడం ద్వారా దిగుబడులు, ఆదాయం పెంపొందించుకోవచ్చని వివరించారు.
ఉత్తమ సాగు పద్ధతులను పాటిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ప్రగతిశీల రైతులను గుర్తించి సత్కరించడం వల్ల మరింత మంది రైతులు శాస్త్రీయ సాగు విధానాలను అనుసరించేందుకు ప్రోత్సాహం లభిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
రైతుల అభివృద్ధి, ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పెంపొందించడం, రైతులు మెరుగైన దిగుబడులు సాధించి ఆదాయం పెంచుకునేందుకు సహకరించడం తమ ప్రధాన లక్ష్యమని ప్రియోనిక్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

























