నడిపల్లిలో విరజిమ్మిన విద్యుత్ కాంతులు
రూ.92 లక్షలతో రెండు కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు.. 150 లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి పేర్కొన్నారు.
డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామంలోని ప్రధాన రహదారిపై రూ.92 లక్షల వ్యయంతో రెండు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను గురువారం సాయంత్రం ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి లైటింగ్‌ను ప్రారంభించారు.
లైటింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాన రహదారి వెంబడి ఏర్పాటు చేసిన 150 సెంట్రల్ లైట్లు వెలిగి విద్యుత్ కాంతులను విరజిమ్మాయి. దీంతో నడిపల్లి ప్రధాన రహదారి వెలుగులతో నిండిపోయింది. రాత్రివేళల్లో రహదారిపై ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు మెరుగైన వెలుతురు అందడంతో పాటు రాకపోకలకు మరింత సౌకర్యం కలగనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల ద్వారా గ్రామాల్లో మెరుగైన వసతులు కల్పించి, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
నడిపల్లి ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ అందుబాటులోకి రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

























