క్షామం లో కూరుకుపోతున్న ఏపీ, తెలంగాణ.. ఆశలన్నీ వాటిపైనే?
హైదరాబాద్ – అమరావతి/ త్రిశూల్ న్యూస్/ కృష్ణ బేసిన్ లో వరదలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కర్ణాటక జలాశయాలపైనే తెలుగు రాష్ట్రాల ఖరీఫ్ ఆశలుపెట్టుకుంది మహారాష్ట్ర లోనూ కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాంకు భారీగా వరద నీరు చేరుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సరైన వానలు పడటం లేదు. ఇక వానలు కురిసే అవకాశం కూడా కనిపించడం లేదు. దీంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ నెల నిరాశపరిచింది. జూలై, ఆగస్టు పైనే ఆశలు రైతులు పెట్టుకున్నారు. ఎగువన భారీ వర్షాలు కురిస్తేనే జూరాల, శ్రీశైలం, సాగర్‌కు వరద నీరు పెరిగి ప్రాజెక్టులు నిండి సాగు నీరు లభ్యమవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లలో ఇప్పటికే గోదావరి నదిలో వరద నీరు ప్రవహిస్తుండటంతో కొంత వరకూ సాగు నీరు కొన్ని ప్రాంతాలకు అందుతుంది.
*ప్రాజెక్టుల్లోకి సాగు నీరు…*
తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి భవితవ్యానికి కీలకమైన కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో ఎట్టకేలకు వరద కదలికలు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా జూన్ నెలలో వర్షాభావ పరిస్థితులు ఎదురై, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు గడిచినా కృష్ణా ప్రాజెక్టులు వెలవెలబోయాయి. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, కర్నూలు, గుంటూరు జిల్లాల రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అయితే, గత వారం రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ఇప్పుడు అన్నదాతల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. కానీ వాతావరణ శాఖ అంచనా ప్రకారం మోస్తరు నుంచి తేలిక పాటి వానలు పడతాయని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల మేరకు ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఉరుములు, మెరుపులతో పాటు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
*తెలంగాణలోనూ వానలు…*
తెలంగాణలోనూ వానలు మొహం చాటేశాయి. గత కొన్ని రోజులుగా వానలు పడటం లేదు. దీంతో భూగర్భ జలాలు ఎండిపోయాయి. ప్రాజెక్టులు ఒట్టిపోయాయి. కానీ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండితే కొన్ని ప్రాంతాలకే సాగు నీరు అందుతుంది. అయితే మిగిలిన ప్రాంతంలో మాత్రం క్షామం తప్పదని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. సాగు నీరు అవసరం లేని పంటలను వేసుకోవాలని ఇప్పటికే అధికారులు రైతులకు సూచిస్తున్నారు. రైతులు ఈ ఏడాది సాగు కష్టమేనన్న భావనకు వచ్చారు. అందుకే పంట వేసి, వానలు పడక నష్ట పోవడం ఎందుకన్న ధోరణిలో అన్నదాతలు ఉన్నారు. అయితే చెదురు మదురు వానలు పడటం తప్ప గట్టిగా వానలు పడే అవకాశం లేదని కూడా వాతావరణ శాఖ అధికారులు తేల్చేశారు. దీంతో ఈసారి రైతన్నలకు క్షామం తప్పదన్న హెచ్చరికలు రాష్ట్రమంతటా వినిపిస్తున్నాయి.

























