వీడీసీ ముసుగులో అరాచకాన్ని సృష్టిస్తున్నారు: సర్పంచ్ ఎర్రం ‘సిలిండర్’ లింగం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్, జూలై 16: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో మహిళా భవన నిర్మాణాన్ని చుట్టుముట్టిన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. మహిళా భవన నిర్మాణాన్ని చేపట్టాల్సిందేనని సర్పంచ్ ఎర్రం “సిలిండర్” లింగం పట్టుదలగా ఉండగా, తరతరాలుగా అది తమ భూమి అని వీడీసీ (VDC) ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో రెండు వర్గాల ప్రజలు బుధవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం మాట్లాడుతూ, వీడీసీ ముసుగులో కొందరు గ్రామ అభివృద్ధిని అడ్డుకోవడం దురదృష్టకరమని విమర్శించారు.
గ్రామంలో మహిళలకు ప్రత్యేక భవనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎన్నికల సమయంలో మహిళలకు మహిళా భవనం నిర్మిస్తానని ఇచ్చిన హామీ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం గ్రామపంచాయతీ పరిధిలోని కచేరీ స్థలంలో మహిళా భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
అయితే, కొందరు వ్యక్తులు వీడీసీ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. వీడీసీ భవనానికి గ్రామపంచాయతీ తీర్మానం కూడా లేదని, గ్రామ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌గా ఎవరికి భయపడేది లేదని, మహిళా భవన నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచే సత్తా లేకపోయినా, వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని కొందరు వ్యక్తులు వీడీసీ ముసుగులో అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
గ్రామ అభివృద్ధి పేరుతో ప్రజలను రెచ్చగొట్టి, బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించిన ఆయన, “ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులం… ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. అభివృద్ధిని అడ్డుకుంటే ఖబర్దార్” అంటూ ఘాటుగా స్పందించారు.
ఈ సమావేశంలో ఉప సర్పంచ్ వాసరి రామచందర్, వార్డు సభ్యులు జనగామ అన్వేష్ గౌడ్, షేక్ పాషా, పేట్ల శ్రీను, నర్మెట నరేష్ కుమార్, నాయకులు సయ్యద్ ఇమ్రాన్, ఫేమస్ ఇమ్రాన్, చేపూర్ వినీత్, కొత్తూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

























