రైతులకు అన్ని వసతులతో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయండి…
అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి…
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం నిర్వహించిన క్వశ్చన్ అవర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హార్టికల్చర్ అంశంపై మాట్లాడారు. అంకాపూర్ గ్రామంలో మోడల్ కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అసెంబ్లీ వేదికగా కోరారు.
అంకాపూర్‌కు నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచే రైతులు కూరగాయల విక్రయాల కోసం మార్కెట్‌లో పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. అంకాపూర్ నుంచి హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు కొత్తిమీరతో పాటు పలు వాణిజ్య పంటలను ఎగుమతి చేస్తున్నారని, మొక్కజొన్న విక్రయాలు ఏడాది పొడవునా కొనసాగుతున్నాయని వివరించారు.
దేశంలోని ఆదర్శ గ్రామాల్లో అంకాపూర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని, గ్రామానికి ప్రత్యేక గ్రాంట్ ద్వారా ప్రతి సంవత్సరం రూ.5 లక్షలు వస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంకాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీకి సబ్సిడీ ద్వారా కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలు కల్పిస్తే స్థానిక రైతులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
మార్కెట్‌కు వచ్చే రైతులకు విశ్రాంతి గదులు, ఇతర మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అంకాపూర్‌ను మోడల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని కోరారు. అంకాపూర్‌లో సాగు విధానాలు, పంటల ఉత్పత్తిని పరిశీలించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం సందర్శకులు వస్తుంటారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ, అంకాపూర్‌లోని పరిస్థితులను పరిశీలించి మోడల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా తెలిపారు.

























