మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
వినూత్న రీతిలో విద్యార్థుల పర్యావరణ అవగాహన కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
బీబీపేట: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీబీపేట మండల కేంద్రంలోని తిమ్మయ్య సుశీల, నారాయణరెడ్డి పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు తమ స్వహస్తాలతో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి తోటి విద్యార్థులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించారు.
రసాయనాలతో, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన వినాయక విగ్రహాల వినియోగాన్ని తగ్గించాలని వారు సూచించారు. మట్టి వినాయకులను పూజించడం ద్వారా చెరువులు, జలవనరులను పరిరక్షించడంతో పాటు భూమి కాలుష్యాన్ని నివారించవచ్చని వివరించారు. “మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే నినాదంతో విద్యార్థులు సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు విశ్వ మోహన్, ఉపాధ్యాయులు ఆనందరావు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్య సభ్యులు, గ్రామస్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























