తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామానికి సేవా కార్యక్రమం
అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం సిమెంట్ కుర్చీల ఏర్పాటు…
త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్
నిజామాబాద్ జిల్లా : కమ్మర్పల్లి మండలంలోని అమీర్నగర్ గ్రామానికి చెందిన గొర్రె వంశీయుడు గొర్రె పోషన్న కుమారుడు గొర్రె గణేష్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. ఇటీవల స్వగ్రామంలో నూతన గృహప్రవేశం నిర్వహించిన ఆయన, తన తల్లిదండ్రులైన స్వర్గీయ గొర్రె లక్ష్మీ, గొర్రె పోషన్న జ్ఞాపకార్థం గ్రామానికి ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని సంకల్పించారు.
ఈ నేపథ్యంలో బుధవారం అమీర్నగర్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, పాఠశాల సమీపంలో ప్రయాణికులు, గ్రామ ప్రజల సౌకర్యార్థం రెండు సిమెంట్ కుర్చీలను ఏర్పాటు చేయించారు.
గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులతో పాటు, సాయంత్రం వేళ గ్రామ ప్రజలు కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి ఈ కుర్చీలు ఉపయోగపడతాయని గొర్రె గణేష్ తెలిపారు.
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమం చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

























