కాంగ్రెస్ ప్రభుత్వ రౌడీయిజం, నిరంకుశ పాలనపై మండిపడ్డ గణేష్ బిగాల…
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులను నిరసిస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా…
నిజామాబాద్: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును, పోలీసుల ద్వారా భౌతిక దాడులు చేయించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ (IDOC) ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల టీషర్టులు ధరించి శాంతియుతంగా అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమని విమర్శించారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ప్రజాప్రతినిధి చీర పట్టుకుని లాగడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలపై భౌతిక దాడులు జరిగాయని గణేష్ బిగాల ఆరోపించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పాలన చేయడం చేతకాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, నిరంకుశ పాలన కొనసాగిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.

























