తాత మధు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫైర్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్, సెప్టెంబర్ 7: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు.
సోమవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. స్పీకర్‌పై తాత మధు చేసిన వ్యాఖ్యలు గతంలో ఎన్నడూ లేని విధంగా నీచమైన రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. దళిత స్పీకర్‌ను అవమానించే విధంగా సభ వెలుపల వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు.
ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే తాత మధుసూదన్ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
అదేవిధంగా సభ వెలుపల బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, చేష్టలను ఎమ్మెల్యే తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య హక్కుగా ప్రతి సభ్యుడికి శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ శాసనసభకు హాజరుకాకపోవడం సిగ్గుచేటని ఎమ్మెల్యే భూపతి రెడ్డి విమర్శించారు.

























