సమాజానికి సోషల్ వర్కర్ల అవసరం ఎంతో ఉంది..
సోషల్ మీడియా ప్రభావంతో కొత్త తరహా మానసిక సమస్యలు.. పరిష్కారానికి సోషల్ వర్కర్లు అవసరం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
ప్రస్తుత సమాజంలో సోషల్ వర్కర్ల అవసరం ఎంతో పెరుగుతోందని కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. విజయ్ కుమార్ అన్నారు. సోమవారం కళాశాలలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం విద్యార్థులు రెండో సంవత్సరం విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రిన్సిపాల్ డాక్టర్ కే. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్రభావం సమాజంలోని అన్ని వర్గాలపై గణనీయంగా పెరిగిందన్నారు. దీని కారణంగా సమాజంలో కొత్త తరహా మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ‘సోషల్ డాక్టర్స్’గా పనిచేసే సోషల్ వర్కర్లు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు.
భవిష్యత్తులో ప్రభుత్వాలు, ప్రజాసంఘాలు, వివిధ సామాజిక సంస్థలు సోషల్ వర్కర్ల ప్రాధాన్యతను గుర్తించి వారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ వర్కర్లకు ప్రయోగశాల సమాజమేనని, సమాజంలో వివిధ రకాల సమస్యలు, రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించి వారికి అవసరమైన సహాయాన్ని అందించడం సోషల్ వర్కర్ల బాధ్యత అని తెలిపారు.
వీడ్కోలు కార్యక్రమంలో విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ, సీనియర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు తదితరాలతో కార్యక్రమం సందడిగా సాగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిష్టయ్య, పీజీ కోఆర్డినేటర్ డాక్టర్ దినకర్ చిన్న, తెలుగు విభాగాధిపతి డాక్టర్ విశ్వప్రసాద్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ జయప్రకాష్, సోషల్ వర్క్ హెచ్‌ఓడీ డాక్టర్ జి. శ్రీనివాసరావు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెచ్‌ఓడీ డాక్టర్ రాములు, సోషల్ వర్క్ అధ్యాపకులు డాక్టర్ జి. రమేష్, డాక్టర్ పి.బి. సత్యం, హిందీ అధ్యాపకులు డాక్టర్ బాలాజీ, తెలుగు అధ్యాపకులు మహేష్ ఆంజనేయులు, గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ నీరడి కార్తీక్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

























