ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు.. బాజిరెడ్డి జగన్ మోహన్
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
డిచ్పల్లి: ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ మోహన్ అన్నారు.
డిచ్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు ర్యాలీగా తరలివెళ్లి అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మోహన్ మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందన్నారు. ఆ హక్కులను కాపాడేందుకు ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమాన్ని, రాష్ట్రం ఏర్పడిన అనంతరం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు, విద్యార్థులు, మహిళలు, పేదలు, యువత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని జగన్ మోహన్ తెలిపారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గుర్తు చేస్తూ ప్రజల ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ప్రచారానికే పరిమితమవుతోందని విమర్శించారు.
“ప్రజల సమస్యలపై మౌనం వహించే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తాం. అవసరమైతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడుతుంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం” అని బాజిరెడ్డి జగన్ మోహన్ స్పష్టం చేశారు.

























