నేరాలపై విద్యార్థులకు పోలీసుల అవగాహన…
ప్రేమ పేరుతో మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై కళాబృందం ప్రదర్శనలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
రామారెడ్డి: రెడ్దిపేట గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేశ్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామారెడ్డి ఎస్ఐ మురళి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా వేదికలను జాగ్రత్తగా వినియోగించాలని ఎస్ఐ మురళి సూచించారు. తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు, బ్యాంకు సమాచారం అందించవద్దని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.
అలాగే మూఢనమ్మకాలను నమ్మకుండా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. మానవ అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బంది వివరించారు.
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషరావు, పీసీ. ప్రభాకర్, యు. సాయిలు మాటలు, పాటలు, కళారూపాల ద్వారా విద్యార్థులకు నేరాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాలరెడ్డి ఉపాధ్యాయులు బద్రి విద్యార్థులు పాల్గొన్నారు. నేరాల నివారణలో విద్యార్థులు కూడా తమ వంతు బాధ్యతగా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు కోరారు.

























