గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు
కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్
కామారెడ్డి జిల్లాలో రాబోయే గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర స్పష్టం చేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం డీజే నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎస్పీ.. డీజేల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ప్రాణహాని కలగకుండా చూడటమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
కామారెడ్డి జిల్లాలోని ప్రతి ఒక్కరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, భారీ జనసమూహంతో జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు పూర్తిగా అనుమతి లేదని స్పష్టం చేశారు. నిమజ్జన కార్యక్రమాలను సంప్రదాయ డప్పులు, వాయిద్యాలు, నృత్యాలతో ప్రశాంతంగా నిర్వహించాలని గణేష్ మండళ్ల నిర్వాహకులకు సూచించారు.
గత ఏడాది కామారెడ్డి పట్టణంలో ఒక్క డీజే కూడా వినియోగించకుండా సంప్రదాయ వాయిద్యాలతో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించామని, అదే స్ఫూర్తిని ఈ ఏడాది కూడా కొనసాగించాలని ఎస్పీ కోరారు.
డీజే సౌండ్ వల్ల వినికిడి లోపం, అధిక శబ్దంతో ఒత్తిడి, రక్తపోటు, తీవ్రమైన తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
డీజేలకు అనుమతి లేనందున నిర్వాహకులు ఎలాంటి అడ్వాన్స్‌లు తీసుకోవద్దని డీజే యజమానులు, ఆపరేటర్లకు ఎస్పీ సూచించారు. ఇప్పటికే అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకుని ఉంటే వెంటనే సంబంధిత గణేష్ ఉత్సవ కమిటీలకు తిరిగి చెల్లించాలని ఆదేశించారు.
నిబంధనలు తెలిసినప్పటికీ ఎవరైనా డీజేలను ఏర్పాటు చేసి వినియోగిస్తే, సంబంధిత నిర్వాహకులు, డీజే యజమానులు, ఆపరేటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే సౌండ్ సిస్టమ్‌లను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతోందని ఎస్పీ తెలిపారు. ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు పోలీస్ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
“డీజేలకు దూరంగా ఉందాం.. సంప్రదాయ వాయిద్యాలతో భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జనం నిర్వహిద్దాం” అని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

























