డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం
పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి: సీఐ వినోద్
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఐ వినోద్ ముఖ్య అతిథిగా హాజరై, శాంతి భద్రతలు, ప్రజల మధ్య సోదరభావం, పరస్పర సామరస్యంపై శాంతి కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు.
ఎస్ఐ ఆరిఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో శాంతి కమిటీ సభ్యులు, వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాబోయే పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సీఐ వినోద్ సూచించారు.
మత సామరస్యాన్ని కాపాడుతూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, వాటిని ఇతరులకు ప్రచారం చేయవద్దని సూచించారు.
అలాగే డీజేలకు పూర్తిగా అనుమతి లేదని, నిబంధనలను ఉల్లంఘించి డీజేలు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వినోద్ హెచ్చరించారు. పండుగలను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

























