విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన
చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: ఎస్‌ఐ ప్రభాకర్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
దోమకొండ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అభ్యుదయ పాఠశాలకు చెందిన 8, 9వ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ ప్రభాకర్ పోలీసుల విధులు, బాధ్యతలు, ప్రజలకు అందించే సేవల గురించి విద్యార్థులకు వివరించారు. ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్‌స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరును వివరించారు.
ప్రజల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న సేవలు, విధి నిర్వహణలో చూపుతున్న అంకితభావం, చేస్తున్న త్యాగాలను విద్యార్థులకు తెలియజేశారు. చిన్నతనం నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు.
చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ చెడు అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు. విద్యార్థులు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పోలీసు వ్యవస్థ పనితీరును తెలుసుకోవడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

























