తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
భారతదేశ ఉక్కు మనిషి, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం (ఏక్తా దివస్) వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి మాట్లాడుతూ జాతీయ సమైక్యత, సమగ్రత, ఐక్యతల ప్రాముఖ్యతను వివరించారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తిని కాపాడుతూ విద్యార్థుల్లో సోదరభావం, సామరస్యం, దేశభక్తి భావాలను పెంపొందించాలని పిలుపునిచ్చారు.
వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏక్తా దివస్ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని జాతీయ సమైక్యత, మత సామరస్యం, సోదరభావం, దేశభక్తిని చాటిచెప్పే నినాదాలు చేశారు.
అలాగే విద్యార్థుల్లో జాతీయ సమైక్యతపై అవగాహన కల్పించడంతో పాటు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను తెలియజేసేందుకు వ్యాసరచన, వక్తృత్వ, పోస్టర్ మేకింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
అనంతరం పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. విజేతలను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొని ఐక్యమైన, సామరస్యపూర్వకమైన, ప్రగతిశీల దేశ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ఎం.బి. భ్రమరాంబిక, డా. ఎం.డి. అతీక్ సుల్తాన్ ఘోరి, డా. అహ్మద్ అబ్దుల్ హలీమ్ ఖాన్, డా. సి.హెచ్. శ్రీనివాస్, డా. ఎన్. స్వామి, డా. సి.హెచ్. నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

























