లింబాద్రి గుట్ట వద్ద బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
గురువారం : 02/07/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్, నిజామాబాద్ జిల్లా:
భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్ట వద్దకు వచ్చే యువతీ యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని భీంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టు చేసిన నిందితుడు: గంధం భాస్కర్ (32), తండ్రి గంగా నర్సయ్య, వృత్తి: కూలీ, నివాసం: లింగాపూర్ చౌత్ గ్రామం, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా.
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో తరచూ లింబాద్రి గుట్ట వెనుక ప్రాంతానికి వెళ్లి, అక్కడికి వచ్చే యువతీ యువకుల ఫోటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించేవాడు. అనంతరం వాటిని చూపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, వివిధ కేసులు పెడతానని బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు.
ఈ క్రమంలో, 29-06-2026 తేదీన ఫిర్యాదుదారుడు మరియు అతని స్నేహితులను బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. భయాందోళనకు గురైన వారు తమ వద్ద ఉన్న రూ.10,000 నగదును నిందితుడికి ఇచ్చారు. అనంతరం మరింత డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితులు భీంగల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని, అనంతరం రిమాండ్ నిమిత్తం న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
ఫోటోలు లేదా వీడియోలు తీసి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు. ఇటువంటి సంఘటనలు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా డయల్–100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

























