మెండోరా గ్రామంలో ‘హర్ ఘర్ జల్’ కార్యక్రమం నిర్వహణ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ మండలం మెండోరా గ్రామంలో బుధవారం ‘హర్ ఘర్ జల్’ (ప్రతి ఇంటికి మంచి నీరు) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి వినియోగంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ శ్రీమతి అమూల్య మాట్లాడుతూ, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ప్రజలందరూ శుద్ధమైన నీటిని తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న మిషన్ భగీరథ నీరు, బోరు నీరు, ఆర్వో (RO) నీటి మధ్య ఉన్న తేడాలను ప్రయోగాత్మకంగా వివరించి, మిషన్ భగీరథ నీటి ప్రాముఖ్యతను తెలియజేశారు.
గ్రామ సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్ మాట్లాడుతూ, గ్రామంలో మిషన్ భగీరథ కుళాయిల ద్వారా సరఫరా అయ్యే నీటిని సద్వినియోగం చేసుకోవాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
అలాగే బోరుబావుల నీటిని అవసరానికి అనుగుణంగా మాత్రమే వినియోగించాలని సూచించారు. నీటిని వృథా చేసే వారిపై రూ.5,000 జరిమానా విధించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని, అందువల్ల నీటిని వృథా చేసిన వారిపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.
కార్యక్రమం అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో అధికారులు, సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సంతోష్, అభిలాష్, బాలరాజు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

























