ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: సీపీ సాయి చైతన్య
నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్‌లో గల ఎస్‌ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారకుండా చదువుపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకుని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన 130 మంది విద్యార్థులకు మొత్తం రూ.13 లక్షల విలువైన స్కాలర్‌షిప్ చెక్కులను అందజేశారు.
ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివారెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లతో పాటు పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి, భవిష్యత్తులో తాము కూడా ఇతర విద్యార్థులకు సహాయం చేసే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే తల్లిదండ్రులు, గురువులను ఎప్పటికీ మరిచిపోకూడదని సూచించారు.
ఈ కార్యక్రమంలో కో-ఫౌండర్ శిరీష, ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

























