యాక్సిడెంట్ చేసి నా భర్తను చంపు.. లేదంటే నేను చస్తా…
అంటూ ప్రియుడికి భార్య పంపిన మెసేజ్‌లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. భర్తను హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి భార్య పన్నిన కుట్ర వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సందేశాలతో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడుకు చెందిన గాదె రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన భవానితో 2016లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రాజేశ్వరరావు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుండగా.. అతని భార్య భవానికి ఓ కొరియర్ బాయ్ సైదులుతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసినట్లు సమాచారం.
గత నెల 27న మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లిన రాజేశ్వరరావు.. భార్య భవాని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసినట్లు తెలుస్తోంది. దీంతో భార్యకు వివాహేతర సంబంధం ఉన్న విషయం బయటపడింది.
దీంతో మరుసటి రోజు చిలుకోడులో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అయితే ఈ వ్యవహారం అనంతరం తనకు ప్రాణహాని ఉందని రాజేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇదే సమయంలో భవాని తన ప్రియుడితో జరిపిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌లు బయటపడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. “యాక్సిడెంట్ చేసి నా భర్తను చంపు.. లేదంటే నేను చస్తా” అంటూ ఆమె పంపిన సందేశాలు భర్తను షాక్‌కు గురిచేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై రాజేశ్వరరావు పోలీసులను ఆశ్రయించగా.. తనకు ప్రాణహాని ఉందని ముందుగానే ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? భార్య, ఆమె ప్రియుడిపై కేసు నమోదైందా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

























