నందిపేటలో ప్రభుత్వ సాంకేతిక కళాశాల విద్యార్థుల రాస్తారోకో…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్…
నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ సాంకేతిక కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ముందుగా ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన విద్యార్థులు, అనంతరం అధికారులకు మెమోరాండం సమర్పించారు. అక్కడి నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి వాహనాలను నిలిపివేసి మహాధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా “వుయ్ వాంట్ జస్టిస్” అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.
స్థానిక ఎస్సై వినయ్ కుమార్ జోక్యం చేసుకొని ప్రజలకు ఇబ్బంది అవుతుందని విద్యార్థులతో మాట్లాడి ధర్నాని విరమింప చేశారు.

























