దుబాయ్‌లో జరిగే GTF జీటీఎఫ్ బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా కేటీఆర్‌కు ఆహ్వానం…
దుబాయ్‌లో గల్ఫ్ తెలంగాణ ఫోరం (GTF) ఆధ్వర్యంలో అక్టోబర్ 11, ఆదివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు తెలంగాణ మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) ని ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని జీటీఎఫ్ ప్రతినిధి బృందం ఆహ్వానించింది.
జీటీఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆకుల సురేందర్ గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్ గారిని కలిసి, దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి తెలంగాణ ఆడపడుచులు, ప్రవాస తెలంగాణ ప్రజలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని ప్రత్యేకంగా ఆహ్వానించింది.
గల్ఫ్ దేశాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో జీటీఎఫ్ ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తోందని ఆకుల సురేందర్ తెలిపారు.
ఈ ఏడాది కూడా దుబాయ్‌లోని తెలంగాణ ప్రజలు, మహిళలు, యువత, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరైతే దుబాయ్‌లోని తెలంగాణ సమాజానికి మరింత ఉత్సాహం, ప్రోత్సాహం లభిస్తుందని జీటీఎఫ్ ప్రతినిధులు పేర్కొన్నారు.

























