డిచ్‌పల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సర్పంచులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల పరిషత్సర్వసభ్య సమావేశం మండల అభివృద్ధి అధికారి భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జెడ్పీ సీఈఓ సాయిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను జెడ్పీ సీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, గ్రామాల పారిశుధ్యం, ఉపాధి హామీ పనులు, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు.
ధర్మారం-బి గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా పరిధిలో ఉన్న గ్రామాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, ఇతర ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గొట్టిపాటి వాసుబాబు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. యానంపల్లి, కోరట్‌పల్లి, సుద్దులం గ్రామాలకు చెందిన ఉపాధి హామీ కూలీల ఖాతాల్లో ఇప్పటివరకు నగదు జమ కాలేదని తెలిపారు.
ఉపాధి హామీ పథకం ఏపీఓ మంజుల మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చేపట్టిన 130 పనులు గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగేలా చర్యలు తీసుకోవాలని, అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
జెడ్పీ సీఈఓ సాయిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో విస్తృతంగా అమలు చేసేలా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రామాల్లోని సమస్యలను గుర్తించి, ప్రతి మూడు నెలలకు ఒకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే సర్పంచులు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసేందుకు కృషి చేయాలని అన్నారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల పురోగతికి ఇలాంటి సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్‌ఐ సంతోష్, ఏపీఓ మంజుల, ఆర్‌అండ్‌బీ ఏఈ, హౌసింగ్ ఏఈ, సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు గొట్టిపాటి వాసుబాబు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

























