బాబాపూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్: భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు అందుబాటులో ఉండేలా అక్టోబర్ 1వ తేదీ నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి, తాలు, చెత్తాచెదారం లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళా సంఘాలు, వ్యవసాయ శాఖ అధికారులు పరస్పరం సహకరించుకోవాలని ఎంపీడీవో కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సమీర్, వ్యవసాయ అధికారి లావణ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్, ఏఎంసీ డైరెక్టర్ చిన్నారెడ్డి, ఐకేపీ సీసీలు శ్రీనివాస్, గంగాధర్, వీఓ మహిళలు, వీఓఏలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

























