రహదారులపై మొక్కజొన్న, వరి ధాన్యం, ఇతర పంటలను ఆరబెట్టవద్దు
జక్రాన్‌పల్లి ఎస్‌ఐ జి. మహేష్ హెచ్చరిక…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతులు రహదారులపై మొక్కజొన్న, వరి ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను ఆరబెట్టవద్దని ఎస్‌ఐ జి. మహేష్ సూచించారు.
రహదారులపై నిరంతరం వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయని, రోడ్లపై పంటలను ఆరబెట్టడం వల్ల వాహనదారులకు ఇబ్బందులు కలగడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రహదారులపై పంటలను ఆరబెట్టడం వాహనదారులకు తీవ్ర ప్రమాదకరంగా మారుతుందని పేర్కొన్నారు.
రహదారులపై పంటలను ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చని, తద్వారా బాధిత కుటుంబాలు తీవ్ర విషాదానికి గురవుతాయని అన్నారు.
కావున రైతులందరూ తమ పంటలను రహదారులపై కాకుండా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే ఆరబెట్టాలని ఎస్‌ఐ కోరారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. రహదారులపై పంటలను ఆరబెట్టి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రోడ్డు ప్రమాదాల నివారణకు రైతులు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్‌ఐ జి. మహేష్ విజ్ఞప్తి చేశారు.

























