మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంలో అభివృద్ధి దిశగా భారత్
కేంద్ర పథకాలతో కోట్లాది మందికి లబ్ధి
‘చాయ్ మిలన్ @ మోదీ జీ 25’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…
ఇందూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ప్రపంచ వేదికపై దేశం తన ప్రత్యేకతను చాటుకుంటోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా, రాజకీయ జీవితాన్ని పురస్కరించుకుని బుధవారం ఇందూరులోని శ్రద్ధానంద్ గంజిలో ‘చాయ్ మిలన్ @ మోదీ జీ 25’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ 13 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం దేశ ప్రధానిగా ప్రజాసేవలో కొనసాగారని గుర్తుచేశారు.
రైతులు, మహిళలు, పేద కుటుంబాలు, వృద్ధులు, విద్యార్థులు, చిరు వ్యాపారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. వైద్యం, గృహ నిర్మాణం, బ్యాంకింగ్, ఆహార భద్రత వంటి రంగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, ఉజ్వల యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు.
2014 తర్వాత జాతీయ రహదారులు, రైల్వేలు, ఆసుపత్రులు, అంతరిక్షం, విమానయానం, రక్షణ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయంగా బలపడుతోందని తెలిపారు.
చాయ్ అమ్మిన స్థాయి నుంచి దేశ ప్రధాని వరకు..
అనంతరం ఇందూరు చాయ్‌వాలా మాదాసు స్వామి యాదవ్ మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలో నరేంద్ర మోదీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుడని కొనియాడారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
మోదీ 25 ఏళ్ల ప్రజా, రాజకీయ జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. తన కుటుంబ మూలాలు కూడా చాయ్ విక్రయించే వృత్తితో ముడిపడి ఉండటం పట్ల గర్వంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకుడు శ్యామ్, కార్పొరేటర్లు బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, నిజామాబాద్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ కిషోర్, గుమస్తా సంఘం అధ్యక్షుడు బాలు, దడువై సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, హమాలీ సంఘం అధ్యక్షుడు అంజయ్య యాదవ్, పైట వెంకటేశం, ఆగమయ్య తదితరులు పాల్గొన్నారు.

























