ఒక పూట కూర కోసం ఏడేళ్లు జైలు పాలు కావొద్దు!
అడవిలో కరెంటు తీగలు పెట్టి మీ కుటుంబాలను రోడ్డున పడేయొద్దు: ఎఫ్ఆర్ఓ రవి మోహన్ బట్…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
ఇందల్వాయి, అక్టోబర్ 17: ఇందల్వాయి మండల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కొండాపూర్ బీట్ అటవీ ప్రాంతంలో అనుమానితులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) రవి మోహన్ బట్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో చెట్టుచెట్టునా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ రవి మోహన్ బట్ మాట్లాడుతూ.. ఒక పూట కూర కోసం ఏడేళ్లు జైలు పాలై మీ కుటుంబాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవద్దని సూచించారు. అడవిలో వన్యప్రాణులను వేటాడేందుకు కరెంటు తీగలు అమర్చడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి తీగల వల్ల తోటి మనుషుల ప్రాణాలతో పాటు మూగజీవాల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు.
అక్రమంగా వేటకు పాల్పడటం, అటవీ భూములను ఆక్రమించడం, టేకు చెట్లను నరికివేయడం, వన్యప్రాణులను వేటాడటం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యల వల్ల జైలు పాలైతే కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.
అటవీ సంపదను, వన్యప్రాణులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ గాలింపు చర్యల్లో సెక్షన్ ఆఫీసర్‌తో పాటు బీట్ ఆఫీసర్లు, ఇతర అటవీ సిబ్బంది పాల్గొని అటవీ ప్రాంతమంతా తనిఖీలు నిర్వహించారు.

























