108 అంబులెన్స్, ఎంసీహెచ్, ఎన్‌ఆర్‌సీ కేంద్రాలను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు, రికార్డుల పరిశీలన…
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న 108 అంబులెన్స్, మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్), పోషకాహార పునరావాస కేంద్రం (ఎన్‌ఆర్‌సీ)లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ బి. రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా 108 అంబులెన్స్‌లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సిలిండర్, స్ట్రెచర్‌తో పాటు నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. అత్యవసర సమయాల్లో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు, మందులు అందుబాటులో ఉండాలని సూచించారు.
అనంతరం ఎంసీహెచ్ కేంద్రాన్ని సందర్శించి మాతా శిశు ఆరోగ్య సేవలు, వైద్య రికార్డులు, టీకాల కార్యక్రమం, అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎన్‌ఆర్‌సీ (న్యూట్రిషనల్ రిహాబిలిటేషన్ సెంటర్)లో చికిత్స పొందుతున్న తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న (ఎస్‌ఏఎం), మధ్యస్థ తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న (ఎంఏఎం) పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. పిల్లలతో ముఖాముఖిగా మాట్లాడి, వారికి అందిస్తున్న పోషకాహారం, పోషకాహార స్థితి, సంరక్షణ సేవలను తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ రేఖ, డాక్టర్ నిరూప్ రెడ్డి, డాక్టర్ శ్రీలత, డాక్టర్ శిఖరాతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

























