క్యాచ్ ది రైన్తో నీటి సంరక్షణపై అవగాహన భీంగల్లో ‘జల శక్తి అభియాన్–జన భాగీదారి’ కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ : కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సీడీఎంఏ ఆదేశాల మేరకు భీంగల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో “జల శక్తి అభియాన్–జన భాగీదారి (JSJB–3.0)” కార్యక్రమంలో భాగంగా “క్యాచ్ ది రైన్” అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ కమిషనర్ గజానంద్ పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాల పెంపునకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. నీరు జీవనాధారమని, నీటిని వృథా చేయకుండా సంరక్షించడం ద్వారా భావితరాలకు నీటి కొరతను నివారించవచ్చని తెలిపారు.
అలాగే పట్టణంలో కొత్తగా ఇళ్లు నిర్మిస్తున్న వారు, ఇప్పటికే నిర్మించుకున్న వారు తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మున్సిపల్ మేనేజర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

























