వసతులు మేము కల్పిస్తాం.. నాణ్యమైన వైద్య సేవలు మీరందించండి”: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…
– జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధిపై రెండున్నర గంటల సమీక్ష సమావేశం
– పేదలకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందేలా అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచించారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి సమీక్ష సమావేశం రెండున్నర గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో నగర మేయర్ ఉమారాణి, IIHFW చైర్‌పర్సన్ డా. కవితా రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార సంస్థ చైర్మన్ శేఖర్ గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. వైద్యులు సేవాభావంతో పనిచేస్తూ ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై మరింత విశ్వాసాన్ని పెంచాలని సూచించారు.
ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల తర్వాత నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రిగా గుర్తింపు పొందిందని, భవిష్యత్తులో రాష్ట్రంలోనే ఆదర్శ ఆసుపత్రిగా ఎదగాలని ఆకాంక్షించారు.
తాను వైద్య వృత్తిలో పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని పేర్కొంటూ, ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా కార్డియాలజీ, గైనకాలజీ, జనరల్ సర్జరీ వంటి కీలక విభాగాలను మరింత బలోపేతం చేయాలని చెప్పారు. అవసరమైన వెంటిలేటర్లు, ఆధునిక వైద్య పరికరాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
రోగులతో వైద్యులు, సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లాలో అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నందున వారి సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించాలని కోరారు.
సమావేశంలో పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్థీషియా, ట్రామా కేర్, డెర్మటాలజీ, మానసిక వైద్య విభాగం, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, జిల్లా క్యాన్సర్ సెంటర్, డీ-అడిక్షన్ సెంటర్ తదితర విభాగాల అధిపతులు తమ శాఖల్లో అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న పరికరాలు, అవసరమైన మౌలిక సదుపాయాలపై వివరాలతో కూడిన నివేదికలను సమర్పించారు. అలాగే ప్రధాన శస్త్రచికిత్సలు, మాతా-శిశు సంరక్షణ చర్యలపై వివరించారు.
సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ, విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదన్నారు.
జీరో మోర్టాలిటీ లక్ష్యంగా వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని, ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, డీ-అడిక్షన్ సేవలను మరింత విస్తరించాలని అభిప్రాయపడ్డారు.
సమస్యలు ఎదురైనా సమిష్టి కృషితో వాటిని అధిగమిస్తూ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని రాష్ట్రంలోనే ఆదర్శ వైద్య సంస్థగా తీర్చిదిద్దాలని సమావేశంలో పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డా. రాజశ్రీ, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

























